satveeracademy

Advertisements

 విద్యాగంధం

మౌలికంగా విద్య అంటే, తెలుసుకోవడం. వ్యక్తులకు ఉపయోగపడే సందర్భాలను పురస్కరించుకొని విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు.

1)            జీవనోపాధికి ఉపయోగపడేది,

2)               ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేది,

3)               జీవిత పరమార్థాన్ని గ్రహించేది.

మొదటి రకమైన విద్యను పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో  జీవనోపాధికి సరిపోయే జ్ఞానం, నైపుణ్యాల రూపేణా  సంపాదించుకోవచ్చు. ఆది చదవడం, రాయడం,  గణించడంతో  పాటు అవగాహనా శక్తిని పెంచుతుంది. సూక్ష్మ దృష్టితో పరిశీలించడం నేర్పుతుంది. రసజ్ఞతను కలిగిస్తుంది. పదిమందితో కలిసిమెలసి తిరగడం  సర్దుబాటు చేసుకోవడం  అలవరుస్తుంది. విద్యలో ప్రావీణ్యం సాధిస్తే సంపదను, పదిమందిలో  గౌరవాన్ని పొందవచ్చు.

 

రెండోదైన ప్రాపంచిక జ్ఞానాన్ని   తెలుసుకోవడానికి- దినపత్రికలు, ప్రసార  మాధ్యమాలు, గ్రంథాలయాలు, పుస్తకాలు చాలా ఉంటాయి. మనం పొందిన జ్ఞానం వ్యక్తులను, పరిస్థి తులను,  చుట్టూ ఉండే పరిసరాలను అవగాహన చేసుకుంటూ మనల్ని మనం మలచుకుంటూ ఆనందంగా ఆర్థ వంతంగా జీవితాన్ని కొనసాగించడానికి దోహదపడాలి. అదే అందరికీ సౌహార్ధ సాంఘి జీవనానికి ఆవశ్యకం. నలుగురిలో కలిసి మెలసి తిరుగుతూ. ఉంటే ఎవరితో ఎలా  మసలుకోవాలో అర్థం అవుతుంది .

విద్యే ఆనందానికి మూలమైతే, ప్రతి  విద్యాధికుడూ ఆనందంగా ఉండాలి. కానీ, కొందరు విశ్వవిద్యాలయ  పట్టా పొంది. ఉన్నత ఉద్యోగంలో ఉన్నా సుఖంగా ఉండటం లేదు.

ఏ విద్యార్హత లేని కొంతమంది మారుమూల గ్రామాల్లోనూ చాలా  ఆనందంగా గడుపుతూ కనిపిస్తుంటారు. అంటే, జీవితాన్ని ఆనందమయంగా  గడపాలంటే కొంత వివేకం, నేర్పు సైతం కావాలి. ఇవి అనుభవంతో గాని సాధనలోకి రావు. పెద్దలపై గౌరవం, బంధుమిత్రుల పట్ల  దాక్షిణ్యం, పనిచేసేవారి మీద దయ, సజ్జనులతో   స్నేహం, దుర్జనుల  విషయంలో కాఠిన్యం, యజమానుల పట్ల విశ్వాసం, కార్యకలాపాల్లో నీతి కలిగి ఉండటం, పొరపాట్లు చేసినవారి పట్ల క్షమ, అసూయాగ్రస్తులపై కేవలం ఉదాసీనత చూపడం మొదలైనవి నేర్పరులు సంతరించుకునే గుణాలు. 

  మూడోది, ఆధ్యాత్మిక  విద్య. భగవంతుడి గురించి తెలియజెప్పేదే నిజమైన విద్య అంటారు. ఈ విద్యను ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలుభగవద్గీత మొదలైన పవిత్ర గ్రంథాలను చదివి, సద్గురువుల  బోధలు విని అభ్యసించవచ్చు. ఏదీ శాశ్వతం కాదని, సకల చరాచర జగత్తు పరమాత్మ స్వరూపమని, తనలో ఉన్న పరమాత్మ అందరిలోనూ ఉన్నదని సమదృష్టి కలిగి ధార్మిక చింతనతో సుఖదుఃఖాలను కష్టనష్టాలను సమానంగా  చిరునవ్వుతో స్వీకరిస్తూ నైతిక జీవనాన్ని గడిపేందుకు ఉపయోగపడుతుంది.

 

విద్య మనలో నిగూఢంగా ఉన్న శక్తియుక్తులను వెలికితీసి కార్యోన్ముఖుల్ని చేస్తుంది. చదువు కేవలం అక్షర జ్ఞానమో, లేక పేరు చివర తగిలించుకునే రెండో మూడో అక్షరాలతో ఉండి పొట్ట నింపుకొనే అర్హతాపత్రమో కాదు. సంస్కారం లేని విద్య పరిమళరహిత పుష్పం. అందుకనే పెద్దలు చదువుతో పాటు  సంస్కారం కావాలి అంటారు. మనిషి నిరంతర విద్యార్థి, విద్య మనిషికి ప్రపంచాన్ని చదవడం నేర్పాలి. ఉచితానుచితాలు తెలియజెప్పాలి. జీవన గమ్యాన్ని సూచించి ఒడుదొడుకులను అధిగమించి లక్ష్యాన్ని చేరేలా ప్రేరణ ఇవ్వాలి. అదే నిజమైన  విద్య. 

కస్తూరి హనుమన్నా గేంద్ర ప్రసాద్

error: Content is protected !!
Scroll to Top