satveeracademy

Advertisements

జీవిత పోరాటాలు ఎప్పుడు బలమైన వ్యక్తుల్నే బాధ పెట్టావు.  కానీ ఎప్పటికైనా సరే గెలిచినవాడు తాను గెలవగలనన్న విశ్వాసం ఉన్నవాడే.  ఆ విశ్వాసం పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి చిహ్నం.  ఆ పరిపూర్ణమైన వ్యక్తిత్వమే  విజయానికి గీటురాయి.

     సక్సెస్.. గెలుపు… విజయం.. ఇలా తరచూ ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు.

 ఒక్కసారి ఆలోచించండి. విజయం  అంటే ఏమిటి? లక్ష్యసాధన మాత్రమేనా?  మీ సమాధానం ‘ అవును ‘  అయితే మీ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిందే . ఎందుకంటే ‘లక్ష్యసాధన’ చేరుకోవాలంటే ముందుగా పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సాధించాలి. ఎందుకంటే వ్యక్తిత్వం అనేది ఒక  వ్యక్తి యొక్క విలువలు విశ్వాసాలు, స్వభావాల మిశ్రమం.  ప్రపంచంలోని అతి విలువగల రత్నం కన్నా వ్యక్తిత్వం ఎక్కువ విలువైనది.  ఒక మనిషి విజయం సాధించాలంటే అతనికి మంచి వ్యక్తిత్వం ఉండాలి. విజయాన్ని చేరుకునే దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అవి అడ్డుకుని పడిపోకుండా ఉండటానికి ఎంతో దృఢమైన వ్యక్తిత్వమూ, ప్రయత్నమూ అవసరం.  అదే విధంగా మన లక్ష్య సాధనలో జీవిత పయనంలో ఊహించని పరిణామాలు జరిగినప్పుడు కృంగిపోకుండా ఉండటానికి చాల దృఢమైన వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి అవుతుంది. 

మరి పరిపూర్ణం అయిన వ్యక్తిత్వం అంటే ఏమిటి ? అందరినీ మెప్పించే స్వభావం గల వ్యక్తిత్వం అంటే
 • ప్రత్యేకత కలిగినది, ప్రశాంత చిత్తానికి మారుపేరు అయినది.
 • అహంకారం లేని ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం గలది.
 • చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకుంటూ, ఇతరుల అవసరాలను గౌర వించేది.
 • ఇతరులని నాశనం చేసి తనని తాను నిర్మించుకునే గుణం లేనిది.
 • గొప్పవారితో కలిసి నడుస్తున్నా కూడా కింది వారితో సంబంధం కలిగి ఉండటం అనే సామర్థ్యం గలది.
 • ఒక మృదువైన మాట, దయగల చూపు, స్నేహభావంతో కూడిన చిరు నవ్వు దీన్ని వ్యక్తం చేస్తాయి.
 • “గెలుపునైనా, ఓటమినైనా సమానంగా స్వీకరించగలిగే స్వభావం గలది. నిరంకుశత్వాన్ని ఎదరించి నిలువగల ఆత్మగౌరవం కలది, బాధ్యతని స్వీకరించే స్వభావం గలది.
 • అణిగిమణిగి ఉండకుండానే మర్యాదగానూ, వినియోగంగానూ ఉండగలిగేది. గర్వం లేకుండా గొప్పగా వ్యవహరించగలిగేది.
 • గెలుపుని సహజంగా స్వీకరించి, ఓటమిని అర్థం చేసుకోగలది.
 • పైన చెప్పిన లక్షణాలలో కనీసం కొన్నింటిని మనం పెంపొందించుకున్నా విజయమే అవసరం లేని, విజయానికే గీటురాయిగా మారే పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని మన సొంతం చేసుకోవచ్చు.

               వ్యక్తిత్వ నిర్మాణం పసిబిడ్డగా ఉండగా మొదలై మనం చనిపోయే వరకూ సాగుతూనే ఉంటుంది.

 •          వ్యక్తిత్వానికి విజయం అవసరం లేదు. ఒక తోటని నాశనం చేసే కలుపుమొక్కల్ని తీసిపారేసే తోట మాలిలాగా మనం కూడా మనలో ఉన్న తప్పుల్ని ఎప్పటికప్పుడు తీసిపారవేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. లేదంటే లక్ష్యాన్ని సాధించిన తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని దిగజార్చే పరిస్థితులు మనకి ఎదురవుతాయి. దీనికి నిదర్శనంగా నేడు అవినీతి స్కాంలలో చిక్కుకున్న కేంద్రమంత్రులు, అభ్యున్నత స్థాయి అధికారులు, ముఖ్య మంత్రులు, విలువల పతనంతో పదవిని కోల్పోయిన గవర్నర్లు మనం చూడవచ్చు.

   

  కష్టాలలో చిక్కుకున్నవారు కొందరు రికార్డులు సృష్టిస్తారు. ఇంకొందరు కుంగిపోతారు. కష్టాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. వ్యక్తిత్వం అనేది ప్రతిధ్వని లాంటిది. ఈ చిన్న కథను చూడండి. ఒక చిన్నపిల్లవాడికి వాళ్ళమ్మ మీద కోపం వచ్చింది. అప్పుడు వాడు “నువ్వంటే నాకసహ్యం, నువ్వంటే నా కసహ్యం ” అని అరిచాడు. కానీ అలా అన్నాక వాళ్ళమ్మ కోప్పడుతుందేమోనని భయపడి ఇంటి బయటికి పారిపోయాడు. అలా వెళ్ళి ఒక లోయని చేరుకున్నాడు. అక్కడ మళ్ళీ “నువ్వంటే నా కసహ్యం, నువ్వంటే నాకసహ్యం అని కేక పెట్టాడు. అతని కేక ఆ లోయలో ప్రతిధ్వనించింది. అంతకు ముందెన్నడు ఆ పిల్లవాడు ప్రతిధ్వని విని ఉండకపోవటం చేత, వాడు భయపడి తల్లి దగ్గరికి పరిగెత్తాడు. తల్లితో లోయలో ఒక చెడ్డ కుర్రాడున్నాడనీ. ‘నాకు నువ్వంటే కసహ్యం ‘ అని అరుస్తున్నాడు.” చెప్పాడు. తల్లికి పిల్లాడు చెప్పుతున్నది అర్ధం అయింది.  ఆమె వాడితో మళ్ళీ లోయలోకి వెళ్ళి “నువ్వంటే నాకిష్టం” అని అరవమని చెప్పింది. పిల్లవాడు తల్లి చెప్పిన మాట విని లోయలోకి వెళ్ళి అలాగే అరిచాడు. అప్పుడు ప్రతిధ్వని కూడా ‘నాకు నువ్వంటే ఇష్టం’ అని బదులు చెప్పింది.

   

        పై కథలో నీతి అర్థమైందిగా మన వ్యక్తిత్వం దేన్నైతే ఇస్తుందో అదే మనం తిరిగి పొందుతాం. వినయం, నిజాయితీ, బాధ్యత ఈ మూడే వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి.

 • మన వ్యక్తిత్వాన్ని బలపరచటమో / స్పష్టంగా చూపించటమో మనం ఎదుర్కొనే కష్టాల వల్లే సాధ్యపడుతుంది. విజయం కన్నా కష్టమైనది ఆ సాధించిన విజయంతో ఏం చేస్తామన్నదే. చాలా మందికి విజయాన్ని ఎలా సాధించాలో తెలుసు. కానీ ఆ తర్వాత దాన్ని ప్రయోజనకరంగా ఎలా వినియోగించాలో తెలీదు. సమర్థతా, వ్యక్తిత్వం కలిసి ఉంటాయి. సమర్థత వల్ల విజయం లభిస్తుంది. విజయం మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయోన్ముఖులుగా ఉంచుతుంది.

ఎదుటివారి గురించి బాధ్యతగా ఆలోచించగలగడం

ఈ సంఘటన చూడండి

          ఒక పదేళ్ళ పిల్లవాడు ఐస్ క్రీం షాపుకి వెళ్ళి బల్లముందు కూర్చొని సర్వర్ని “ఐస్  క్రీం కోన్ ధర ఎంత?” అని అడిగాడు. “75 సెంట్లు” అని జవాబు వచ్చింది. తన చేతిలోని చిల్లర లెక్కపెట్టుకుని ఆ పిల్లవాడు ఒక చిన్న కప్పు ఐస్ క్రీం వెల ఎంత? అని అడిగాడు. సర్వర్ అసహనంగా 65 సెంట్లు” అన్నాడు. “నాకు ఒక చిన్న కప్పు ఐస్క్రీం కావాలి” అన్నాడా పిల్లవాడు.

ఐస్ క్రీం తిని బిల్లు చెల్లించి వెళ్ళిపోయాడు. ఖాళీ ప్లేటు తియ్యటానికి ఆ బల్ల దగ్గరికి వచ్చిన సర్వర్ మనసు చలించిపోయింది. ఆ ప్లేటు కింద రెండు పదిసెంట్ల నాణేలు అతనికి ‘టిప్’గా వదిలి వెళ్ళాడా పిల్లాడు. వాడు తనకి ఐస్ క్రీం తెప్పించుకునే ముందు సర్వరిని కూడా దృష్టిలో ఉంచుకొన్నాడు. సున్నిత మనస్తత్వాన్ని అవతలి వ్యక్తి అవసరాలని గమనించే స్వభావాన్ని కనపరిచాడు. తన గురించి ఆలోచించుకునే ముందు తాను ఇతరుల గురించి ఆలోచించాడు.

ఆ పిల్లాడిలా మనందరం ఆలోచించగలిగితే ఈ ప్రపంచ ముఖచిత్రమే మారిపోతుంది. అవతలి వారి గురించి ఆలోచించటం అనేది ఎదుటివారి పట్ల మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.

మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న సమాధానం తెలుసునేమో ఆలోచించండి. “మీ దగ్గర ఉన్నంత కాలం ఎలాంటి విలువ లేనిది, ఇంకొకరికి ఇవ్వగానే ఎంతో విలువైనదిగా మారేది”. దీన్ని పొందకుండా జీవించగల ధననంతులూ లేరు. దీన్ని పొందలేనంత బీదవారు లేదు.

ఇది అలసిపోయిన వారికి విశ్రాంతి లాంటిది. నిరాశ చెందిన వారికి సూర్యోదయం లాంటిది. విచారంగా ఉన్న వారికి సూర్యరశ్మిలాంటిది.

అదేమిటంటే … చిరునవ్వు ఎంతటి  సమస్య, కష్టం వచ్చిన ముఖంపై చిరున్నవ్వుని చెరగనివ్వకండి. చిరునవ్వే ఎన్నో సమస్యలని పరిష్కరిస్తుంది చక్కని వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది .

వినియం లేని ఆత్మవిశ్వాసం దర్పం అనిపించుకుంటుంది. వినయం అన్ని సద్గుణాలకు పునాది. ఈ కథని చూడండి.

చాలా ఏళ్ళ క్రితం ఒక వ్యక్తి గుర్రాన్ని ఎక్కి పోతుంటే కొంత మంది సైనికులు బరువైన దున్గని కదిలించటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ కని పించారు.

మిగతావారు ప్రయసా పడుతుంటే, వారి నాయకుడు మాత్రం నిలబడి చూస్తున్నాడు. అప్పుడు అటుగా వచ్చిన వ్యక్తి ఆ నాయకుడిని మీరు సాయం చెయ్యటలేదే అని అడిగాడు. “నేను ఈ దండు నాయకుడిని, నేను ఆజ్ఞలు మాత్రమే జారీ చేస్తాను” అన్నాడు. వెంటనే గుర్రం మీదున్న వ్యక్తి కిందికి దిగి, మిగతా వారి వద్దకు నడిచి, ఆ దుంగని ఎత్తటంలో వారికి సహాయం చేసాడు. అతను కూడా ఓ చెయ్యి వెయ్యగానే ఆ దుంగని జరపటం వీలయింది.

       అప్పుడా వ్యక్తి మాట్లాడకుండా తన గుర్రం దగ్గరికి వెళ్ళి, దాన్ని ఎక్కి, జట్టు నాయకుడి దగ్గరకు నడిపించి ” ఈ సారి నీ క్రింద పనిచేసే సైనికులకి సహాయం  కావాలంటే సర్వసేనాధిపతికి కబురుపెట్టు అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ఆయనే ‘జార్జి వాషింగ్టన్’ అనే విషయం అందరికీ తెలియవచ్చింది. మరి వాషింగ్టన్ ఎవరో మీ అందరికీ తెలిసిందే..

ఒక రష్యన్ సామెత ‘సుత్తి గాజుపలకను ముక్కలు ముక్కలు చేస్తుంది. అదే సుత్తి ఉక్కుకి ఆకారం ఇస్తుంది. ఇక్కడ సుత్తి ఒక్కటే కాని మనం గాజుతో తయారైన వారిమా, ఉక్కుతో చేయబడ్డామో! అన్నది మన వ్యక్తిత్వం నిర్ధారిస్తుంది.

కనుక మీరు పరిపూర్ణ వ్యక్తిత్వంతో మెలిగి లక్ష్య సాధనలోనే కాదు, జీవితంలోనూ పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ..

కె . కవితా కృష్ణ

 వివేక్ మ్యాగజైన్ (నవంబర్ 2012 )

* పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top